*అలసిన వానికి ఊరడించు మాటలు*
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞
*సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు*
*🕯️🕯️🕯️జులై 1🕯️🕯️🕯️*
*"సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై యున్నది" (1 తిమోతి 6:6)*
ఎస్తేరు, రాజైన అహష్వేరోషు యొక్క దయాదాక్షిణ్యములు పొందెను. చాల మంది యవ్వన కన్యకలు అతని ముందుకు వరుసగా తీసికొని రాబడిరి. ఆమె రాజు యొద్దకు వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది ఆమెకు ఇవ్వబడును. అవి వస్త్రములు గాని, బంగారము, వెండి గాని, శుద్ధి కొరకైన వస్తువులే గాని ఏదైనను ఇవ్వబడకఉండదు. మిగిలిన ఇతర స్త్రీలు అనుదినమును అనేకము అడుగుచుండిరి. కానీ ఎస్తేరు ఏమియు కోరలేదు. (ఎస్తేరు 2:15) ఒక వ్యక్తి "నాకేమి వద్దు" అని చెప్పుట ఎంత అద్భుతము! "నాకేమి వద్దు" అని చెప్పిన వారిని గూర్చి నేను వినలేదు. కొంతమందికి ఏమిచ్చినను తృప్తి కలుగదు. నీ భార్యకు 100 చీరలిచ్చినను, ఇంకా 10 కావలెనని అడుగును. ఇంకను అధికముగా అడుగును. వారికి ప్రతి నెల క్రొత్తది కావలెను. నీవు ఎటువంటి ఆభరణములిచ్చినను వారికి తృప్తి కలుగదు. కొంతమంది భర్తలు తమ జీతమంతయు భార్యలకు ఇత్తురు. వారు తమ భర్తలకు జీతము వచ్చు రోజు కొరకు కనిపెట్టుచుందురు. ఒక వేళ ఒక 25 రూపాయలు తక్కువ ఇచ్చిన యెడల భర్తలను ప్రశ్నించుదురు." ఏమైనది ? ఈ నెల 25 రూపాయలు ఎందుకు తక్కువ ఇచ్చితివి? నీవు ఎక్కడ ఖర్చు పెట్టితివి? దానితో ఏమి చేసితివి? దానిని ఎవరికి ఇచ్చితివి? అని ప్రశ్నించుదురు. కొందరు 10 రోజులలోనే జీతమంతయు ఖర్చు చేసి ఇంకా డబ్బు కావలెనని అడుగుదురు. వారెవరైనను వారికి తృప్తి ఉండదు.
కానీ ఇక్కడ కథలో ఏమి చెప్పబడుచున్నదనగా, ఆమె తరుణము వచ్చినప్పుడు ఏమియు కోరలేదు. దాని ఫలితము, ఆమె అతని దయ పొందుటయే. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె ఎడల దయకలిగెను. ఆమె కేవలము రాజు దృష్టిలోనే దయ పొందుట కాదు, రాజ భవనంలోని అందరి దృష్టిలో దయపొందెను. ఆమె దేవుని యందు ఎంతో అధికమైన భయభక్తులు కలిగి యుండినది. ఆమె జీవితము, విశ్వాసము ద్వారా ఇశ్రాయేలు దేశమంతయు రక్షించబడినది. ఏవిధముగా తృప్తిని, సంతృప్తిని కలిగియుండవలెను ఆ రహస్యమును ఆమె నేర్చు కొనినది. లోకములో ఏదియు తనను తృప్తి పరచలేదని ఆమె ఎరిగినది. లోకము ఎంత ఆకర్షణీయముగా నుండినను మనలను తృప్తి పరచలేదు. చాలామంది స్త్రీ, పురుషులు తిని త్రాగుట ద్వారా, వస్త్రములు, బంగారము, వెండి, నగలు కొనుట ద్వారా సంతోషించగలము అని అనుకొందురు. అందువలననే వారి జీవితములు ఓటమి పొందుచున్నవి. అందువలననే వివాహములకు ముందు బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, మధ్యవర్తుల ద్వారా ఎంత కట్నమిచ్చెదరని, ఎంత భూమిని ఇచ్చెదరని సమాచారమును సేకరించెదరు. వారు బహిరంగముగా అడగరు గాని రహస్యముగా ఆ తండ్రికి ఎంత మంది పిల్లలు, మరి ఈమెకు ఎంత వచ్చును? అని తెలిసికొందురు. విషయములన్నియు తెలిసికొనిన తరువాత "మాకు సమ్మతమే" అని చెప్పుదురు. ఒకవేళ వారికి తృప్తి కలుగని యెడల "ఈ సంబంధము విషయములో మాకు సమాధానము లేదు" అని చెప్పుదురు. ఎందుకనగా వారి దృష్టి లోక సంబంధమైన విషయముల మీద, ఆ అమ్మాయి రంగు మీద, అర్హతలు మొదలగు వాటి మీద నుండుటచేతనే ఆ విధముగా చెప్పుదురు. అందువలననే వారు నిరుత్సాహపడుదురు. సంతృప్తి, గృహమును సంతోషముగా నుంచగలదు.
Please share
🙏🏼Praise the LORD🙏🏼
Comments
Post a Comment